Telangana State is Going to Celebrating 10th Year Of State Formation but what about Mudiraj Caste


ఈ మధ్యనే తెలంగాణ రాష్ట్రం 9వ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని వేడుకలు జరుపుకున్నది. మరి ఈ 9 సంవత్సరాల్లో జరిగిన అబివృద్ధి రాష్ట్రంలో 14 శాతానికి పైగా వున్న ముదిరాజ్లపై ఎలాంటి ప్రబావం చూపింది? స్వాతంత్ర్యఫలాలు, ప్రజాస్వామ్యఫలాలు ఎవరికి అందాయి? రాజ్యాంగ హక్కులు ఎవరు అనుభవించ గలుగుతున్నారు? అనే విషయాలను చర్చించవలసిన అవసరం ఉంది. రాజకీయ పార్టీలు, ప్రభుత్వం, పార్లమెంట్, ముఖ్యంగా రాష్ట్రఅసెంబ్లీలు, మంత్రిమండళ్ళు ఏకులాల ఆధిపత్యంలో ఉన్నాయి? పాలనారంగం, న్యాయవ్యవస్థ, ప్రభుత్వ రంగ సంస్థల యాజమాన్యాలు, పెట్టుబడులు, బడ్జెట్లు, బ్యాంకింగ్, వర్తక, వాణిజ్యాలు, కార్పొరేట్లు, రియల్ఎస్టేట్లు, లోన్లు, సబ్సిడీలు- ఇలామొత్తం ఆర్థికవ్యవస్థపై ఆధిపత్యం ఎవరికి ఉంది? విద్యాసంస్థలు, విజ్ఞాన, సాంకేతికరంగం, ఐటీ, హోటళ్ళు, సినిమారంగం వంటి అనేకరంగాలు, సదుపాయాలపై ఎవరి అధికారం ఎంత? వీటిలో బీసీల వాటా ఎంత అనే విషయాన్ని విశ్లేషించుకోవాలి.


ప్రభుత్వ విధానాలు, ప్రణాళికలు, బడ్జెట్ కేటాయింపులో బీసీల వాటా ఎంత?అందులో ముదిరాజ్ల వాటా ఎంత? అసలు ఈ అభివృద్ధి వ్యూహాలను అల్లేదెవరు? అందులో ముదిరాజ్ల ప్రమేయం ఎంత? అనేది అర్ధం చేసుకోవలసి ఉంది. వివిధ స్థాయిల్లో ఎన్నికవుతున్న ప్రజాప్రతినిధులు ఎవరు? దేశవ్యాప్తంగా అభివృద్ధిని ప్రభావితం చేసే, లేదా ప్రభుత్వ సహాయాన్ని అందించే అధికారం గల సంస్థలు, లక్షలాది నామినేటెడ్ పదవుల పంపిణీ ఏ కులాల చేతుల్లో ఉంది? ఆ ఫలాలు ఏ కులాలకు చెందుతున్నాయో గుర్తించాలి. కొన్ని కులాల చేతుల్లోనే అన్ని అధికారాలూ కేంద్రీకృతం కావడం వల్ల వారు తీసుకునే నిర్ణయాలు కూడా ఆయా కులాలవారికి అనుకూలంగానే ఉంటున్నాయి. ఈ దేశంలో వనరుల పంపకం లేదా పునఃపంపకం ఎలా జరిగిందో, ఎవరి వాటా ఎంతో, స్వాతంత్య్రం వచ్చాక ఎవరి ఆస్తులు ఎంతెంత పెరిగాయో, ఎవరు ఎంతెంత కోల్పోయారో లెక్కలు తీయాల్సిన అవసరం ఉంది.


వాస్తవానికి రాష్ట్రంలో జనాభాలో, ఓటర్లలో అత్యధిక శాతం ముదిరాజ్లే. ప్రభుత్వానికి అత్యధిక శాతం పన్నుల రూపంలో, ఇతరత్రా ఆదాయాన్ని అందజేసేదీ ముదిరాజ్లే. ఎక్కువ మంది వినియోగదారులు ముదిరాజ్లే. ఎక్కువ శాతం మానవ వనరుగా, నిపుణ కార్మికులుగా, ఉత్పత్తిలో అధికశాతం అందించేవారిలో, రాష్ట్ర సంపదను నిర్మించినవారిలో అధిక శాతం ముదిరాజులే. అలాగే దారిద్య్ర రేఖకు దిగువన పడిపోయింది కూడా ఎక్కువగా ముదిరాజులే. వృత్తులు ధ్వంసమై, వనరులు కోల్పోయి, విద్యకు, ఆరోగ్యానికి నోచుకోక గ్రామాలు, కుటుంబాలు వదలి పొట్ట చేతపట్టుకుని వలస వెళ్ళే వారిలో కూడా అత్యధిక శాతం ముదిరాజులే. ఉపాధులు కోల్పోతూ, అప్పుల ఊబిలో కూరుకుపోయి, ఆకలి చావులకు, ఆత్మహత్యలకు గురవుతున్నది కూడా ఎక్కువ శాతం ముదిరాజులే. రాజ్యాంగం, ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక హక్కులు, రాజకీయ పార్టీల వాగ్దానాలు, ఎన్నికల ప్రణాళికలు అన్నీ ఉన్నప్పటికీ ఈ పరిస్థితి ఇలా ఎందుకు కొనసాగుతున్నదో చర్చించవలసి ఉన్నది. భారత దేశంలోని ఈ కుల వ్యవస్థ వల్ల వాస్తవానికి లాభపడుతున్నదెవరు? కులాన్ని నిర్మూలిస్తే లాభపడేదెవరు? తరతరాలుగా కుల వ్యవస్థవల్ల అగ్రకులాలవారే ప్రయోజనం పొందారన్న మాట వాస్తవం. 


దానివల్ల లభించిన అధికారాన్ని, దానిని కొనసాగిస్తూ తమ అధికారాన్నవిస్తృత పరచుకుంటూ అన్ని రంగాలను ఆక్రమించి దోపిడీని యథేచ్ఛగా కొనసాగించాలని కోరుతున్నదీ వారే. అందుకే కులం కొందర్ని అందలం ఎక్కించింది. మెజారిటీ ప్రజల్ని అధఃపాతాళానికి తోసేసింది, అణచివేతకు గురి చేసింది. స్వాతంత్ర్యం వచ్చిన అనంతరం కూడా జరిగిన ఉద్యమాలన్నింటిలో, రాజకీయ కార్యక్రమాల్లో జెండాలు మోసిందీ అత్యధికంగా ముదిరాజులే. పోరాటాల ఫలితాలు మాత్రం ముదిరాజులకు దక్కలేదు.


ఇతర బీసీ కులాలు పోరాడి సాధించుకున్న రిజర్వేషన్లను కూడా అనేక లిటిగేషన్లతో, క్రీమీలేయర్ వంటి విధానాలతో ఏదో ఒక రూపంలో ఆపేసే ప్రయత్నాలు చేయడం నిరంతరంగా జరుగుతూనే ఉంది. సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, సమానత్వం అన్న సిద్ధాంతాలను అపహాస్యం చేయడమో జరుగుతోంది. ముదిరాజులని మభ్యపెట్టడమో, విస్మరించడమో కొనసాగుతూనే ఉంది. ఇది ఇలా ఇంకెంత కాలం కొనసాగుతుంది? ఇప్పుడేం చేయాలో పరిశీలించవలసి ఉంది. ఈ పరిస్థితి మారి బీసీలకు అన్ని రంగాల్లో, అన్ని స్థాయిల్లో సమాన అభివృద్ధి, సమానావకాశాలు, సమాన ప్రాతినిధ్యం, సమాన భాగస్వామ్యం లభించి రాజ్యాంగంలో పేర్కొన్నట్టు సమానత్వంతో, గౌరవ ప్రదమైన భారత పౌరులుగా జీవించే క్రమాన్ని నిర్దేశించుకోవడంలో ముదిరాజ్ మేధావులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, ముదిరాజ్ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాలు పంచుకోవలసి ఉంది.


మీ బంధు మిత్రులు

గుండెబోయిన నరేష్ ముదిరాజ్

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم