మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా!


తాళిబొట్టు-మాంగల్యం_....
........................................
దౌర్భాగ్య పరిస్థితి ఏమిటంటే మన హిందూసోదరీమణులు నవీనత పరాకాష్టకి వెళ్లి మంగళసూత్రాన్ని త్యజించడం.

 సినిమాలు టీవీల పుణ్యమా అని అది ఒక ఆట వస్తువుగా మారిపోయింది. ఎక్కువ శాతం కనిపిస్తున్న లేదా మన ఖర్మ కొద్దీ మన బంధు మిత్రగణాల నుండి వచ్చే వాట్సాప్ లు ఫేస్బుక్ లలో వచ్చే ఫోటోలు అన్ని ఎక్కువ శాతం మంగళసూత్రాలు, బొట్టు, గాజులు లేకుండా ఉన్నవే. ఇది చాల అరిష్టం.

పరమశివుడు భయంకరమైన హాలాహలాన్ని త్రాగి కూడా చిరంజీవి గా ఉన్నడంటే అది ఆయన గొప్ప కాదట, అమ్మ పార్వతీ దేవి కంఠాన్న ఉన్న మాంగల్యాభరణం గొప్పదనమట.

*“మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా! కంఠే భద్నామి సుభగే త్వం జీవ శరదాం శతం”*

ఓ సుభగా! నా జీవనానికి ఆధారమైన ఈ మంగళ సూత్రాన్ని నీ కంఠానికి కడుతున్నాను. నువ్వు దీనిని ధరించి నా జీవితాన్ని నిలుపుతావు. అటువంటి నువ్వు నూరేళ్ళు జీవించు, అంటే పుణ్యస్త్రీగా, ముత్తయిదువుగా జీవించు అని స్పష్టముగా తెలుస్తున్నది.

పూర్వం భారతదేశంలో మాతృస్వామిక వ్యవస్థ విరాజిల్లినప్పుడు ఎటువంటి ఆచారాలు, కట్టుబాట్లు ఉండేవి కాదు. బలవంతుడిదే రాజ్యం అన్న రోజులవి.

భారతావనిలో పిండారీలు, థగ్గులు వంటి కిరాత జాతులవారు వలస వచ్చారు. ఒక తెగకు చెందిన స్త్రీలను మరొక తెగకు చెందిన పురుషులు ఎత్తుకొనిపోయేవారు.

మహిళ మెడలో మంగళసూత్రం కనిపిస్తే చాలు ఏ హాని చేయకుండా విడిచిపెట్టేవారు. కిరాతకులు కూడా ఈ మంగళ సూత్రాన్ని గౌరవించారు. అలా కోట్లాది మగువల మాన ప్రాణాలను కాపాడిందీ మంగళసూత్రం. అందుకే అప్పటినుండీ ఆడపిల్ల పుడితే బాల్యంలోనే పెళ్ళి చేసి మాంగల్యం వేసేవారు.

ఆదిశంకరాచార్యుల వారు వ్రాసిన సౌందర్యలహరి పుస్తకములో కూడా మంగళ సూత్రానికి విశేష విశిష్టత కల్పించారు.

మంగళసూత్రంలో ముత్యం, పగడం ధరింపజేసే సాంప్రదాయం మనది, ఎందుకంటే, ముత్యం చంద్రగ్రహానికి ప్రతీక. చంద్రుడు దేహ సౌఖ్యం, సౌందర్యం, మనస్సు, శాంతి, ఆనందములకు, అన్యోన్యదాంపత్యములకు కారకుడు, శారీరకంగా నేత్రములు, క్రొవ్వు, గ్రంథులు, సిరలు, ధమనులు, స్తనములు, స్త్రీల గుహ్యావయములు, నరములు, ఇంద్రియములు, గర్భధారణ, ప్రసవములకు కారకుడు.

పగడం కుజగ్రహనికి ప్రతీక. కుజగ్రహ దోషాల వలన అతికోపం, కలహాలు, మూర్ఖత్వం, సామర్ధ్యము, రోగము, ఋణపీడలు, అగ్ని, విద్యుత్భయములు, పరదూషణ, కామవాంఛలు, దీర్ఘసౌమాంగల్యము, దృష్టి దోషము యిత్యాదులు మరియు శారీకంగా ఉదరము, రక్తస్రావము, గర్భస్రావము, ఋతుదోషములు మొదలగునవి.

ఖగోళంలో ముఖ్యమైన నక్షత్రాలు 27. ఆ 27 నక్షత్రాలలో చంద్రుడు 27 రోజులు సంచారంగావించి 28వ రోజున
కుజునితో కలిసే రోజే స్త్రీకి ఋతుసమయం. అంటే అర్ధం, ఆరోగ్యమైన స్త్రీకి 28వ రోజులకు ఋతుదర్శనమవాలి.

భారతీయ సాంప్రదాయ స్త్రీలకు మంగళసూత్రములో ముత్యం మించిన విలువైనది లేనేలేదు, దానికి తోడు జాతిపగడం ధరించడం మన మహర్షులు చెప్పటంలో విశేష గూడార్ధమున్నది.అదేమిటంటే ముత్యం పగడం ధరించిన పాత తరం స్త్రీలలో ఆపరేషన్ అనేది చాలా అరుదైన విషయం. కాని నేటితరం స్త్రీలలో కానుపు ఆపరేషన్తోనే జరగటం సర్వ సాధారణమైపోయింది.

ముత్యం, పగడం సూర్యుని నుండి వచ్చే కిరణాలలో ఉండే ఎరుపు (కుజుడు) తెలుపు (చంద్రుడు) స్వీకరించి స్త్రీ భాగంలోని అన్ని నాడీకేంద్రములను ఉత్తేజపరచి శరీరకంగా, భౌతికంగా ఆ జంట గ్రహాలు స్త్రీలలో వచ్చే నష్టాలను, దోషాలను తొలగిస్తాయనటంలో ఎటువంటి సందేహం వలదు.

పాశ్చాత్య అనుకరణ వెర్రి లో ఊగుతున్న మన ఆడ కూతుర్లను మందలించైనా తిరిగి మన ధర్మం వైపు తీసుకుని వద్దాం. దీని విశిష్టతని అర్ధం అయ్యే వరకు తెలియపరుద్దాం.

కంచి పరమాచార్య పథం పుస్తకాల నుండి, కొంత స్వయంగా గ్రహించి రాసినవి. ఏమైనా తప్పులుంటే పెద్దలు సరిదిద్ది మన్నించగలరు.

*సర్వం శ్రీ పరమేశ్వర పాదారవిందార్పణమస్తు!*

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم