Govt turns a Target on fishermen - Article On Surya News Paper Sep 2011 - Telugu
సముద్రంపై ఆధారపడి ఎన్నో కుటుంబాలు జీవిస్తున్నాయి. మండల పరిధిలోని చినతీనార్ల, రాజయ్యపేట, బంగారమ్మపేట, తదితర గ్రామాల్లో ఎక్కువగా మత్స్యకారులు జీవనం సాగిస్తున్నారు. వీరి ప్రధాన వృత్తి చేపలవేట. వేటపై ఆధారపడి బతుకుతున్న వీరికి ప్రతి సంవత్సరం ప్రభుత్వం 45 రోజులు వేట నిషేధం విధిస్తుంది.
ఏప్రిల్ 15 నుంచి మే 31 వరకు ఈ నిషేధం అమలు అవుతుంది. ఎందుకంటే ఈ సమయంలో సముద్రంలో చేపలు గుడ్లు పెట్టి పిల్లలను కంటాయి. ఈ సమయంలో ఇంజన్బోట్లు గాని, ఫైబర్ బోట్లతోగాని వేట నిషేధిస్తారు. వేట నిషేదంలో మత్స్యకారులకు రేషన్ పంపిణీ చేసేవారు. ఈ ఏడాది ఎటువంటి చర్యలు ప్రభుత్వం గాని అధికారులు గాని చేపట్టలేదు. తమను ఈ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేట నిషేద సమయంలో పూట గడవక పస్తులు ఉండాల్సిన పరిస్థితి నెలకొందని వాపోతున్నారు.
నేటి నుంచి గంగమ్మను నమ్ముకొని వేటసాగిస్తామన్నారు. మత్స్యకారులంటే అందరూ చిన్నచూపు చూస్తున్నారని, విపత్తులుసంభవించినపుడు ప్రథమంగా నష్టపోయేది తామేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటువంటి పరిస్థితిలో కూడా ప్రభుత్వం స్పందించి కనీస సహాయం చేయడం లేదని తమ గోడు వినిపిస్తున్నారు. కనీసం మత్స్యకార అధికారి కూడా స్పందించడం లేదన్నారు.
తమ బాగోగులు చూడవలసిన అధికారి తమ గ్రామానికి వారి అవసరం కోసమే వస్తారు తప్ప తమ సమస్యలు పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. నిషేధ సమయంలో తమకు రావాల్సిన రేషన్, భృతి తక్షణమే తమకు అందజేయాలని డిమాండ్ చేశారు. మండల పరిధిలో సుమారు ఎనిమిది గ్రామాల మత్స్యకారులున్నారని వాటి కనీస సమస్యలు పరిష్కరించేందుకు మత్స్యకార అధికారులు దృష్టిసారించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఎంతో మంది మత్స్యకారులున్నారని తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.
Post a Comment