మత్స్య సంపద మత్స్యకారులదే , అర్బన్ జెసి దయానంద్
ఎన్‌జిఒస్ కాలనీ: రాష్ట్రంలోని మత్స్యకారుల
 కుటుంబాలను ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేయాలన్న ఉద్ధేశంతో తెలంగాణ 
రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా చేపపిల్లల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిందని 
వరంగల్ అర్బన్ జిల్లా జాయింట్ కలెక్టర్ దయానంద్ అన్నారు. శుక్రవారం 
హన్మకొండలోని అంబేద్కర్ భవన్‌లో వరంగల్ అర్బన్ జిల్లా పరిధిలోని 
మత్సకారులకు జిల్లా మత్సశాఖ ఆధ్వర్యంలో చేపపిల్లల సరఫరాపై ఏర్పాటు చేసిన 
అవగాహన సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా 
జాయింట్ కలెక్టర్ దయానంద్ మాట్లాడుతూ 2017,———18 సంవత్సరంలో ధర్మసాగర్ 
శాశ్వత రిజర్వాయర్, హసన్‌పర్తి, కమలాపూర్ చెరువులలో 12.52 లక్షల చేపపిల్లలు
 ధర్మసాగర్‌లో 3.05 లక్షల చేపపిల్లలు హసన్‌పర్తి చెరువులలో 3.03 లక్షల 
చేపపిల్లలను కమలాపూర్‌లో వదిలామని ఆయన తెలిపారు. అదేవిధంగా 99  మత్సశాఖ 
చెరువులు, గ్రామ పంచాయతీ కుంటలలో 131.19 లక్షల చేపపిల్లలను ఉచితంగా పంపిణీ 
చేయుటకు కార్యాచరణ రూపొందించామని తెలిపారు.
ఈ కార్యక్రమాల ద్వారా మత్స్యకారులకు 
ఆర్థికంగా అభివృద్ధికి దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ చేప పిల్లల
 పంపిణీ కార్యక్రమంలో మత్సశాఖ అధికారులతో పాటు రెవెన్యూ గ్రామస్థాయిలోని 
అధికారులు, ఎండిఒలను భాగస్వామ్యులుగా చేర్చి ఈ పథకాన్ని సమర్ధవంతంగా 
నిర్వహించడానికి ప్రతి మండలానికో ఎండిఒను నోడల్ అధికారిగా, ప్రతి 
గ్రామానికి గ్రామ కార్యదర్శిని నోడల్ అధికారిగా జిల్లా కలెక్టర్ నియమించడం 
జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమానికి 11 రూట్ మ్యాప్‌లను తయారు చేశామని 
అందుకనుగుణంగా మండల కేంద్రాలకు నిర్ధేశించిన ప్రకారం చేపల పంపిణీ 
కార్యక్రమం చేపడుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులను
 భాగస్వామ్యం చేసేలా ప్రయత్నం చేయాలని మత్సకార, సహకార సంఘం సభ్యులను 
కోరారు. దళారుల ప్రమేయం లేకుండా నేరుగా మత్సకారులే మార్కెటింగ్ 
చేసుకోవాలని, మార్కెటింగ్ కొరకు అనువైన ప్రదేశాన్ని ఎంపిక చేసినట్లయితే 
ప్రభుత్వ పరంగా ప్రతి మండల కేంద్రంలో చేపల మార్కెట్‌ను ఏర్పాటు చేయుటకు 
చర్యలు తీసుకుంటామని జెసి అన్నారు. ప్రభుత్వం నిబంధనల ప్రకారం చెరువులను 
వేలం వేయడం చట్ట విరుద్ధమని, మత్స సంపదను మత్సకారులకే చెందే విధంగా చర్యలు 
తీసుకుంటామని జిల్లాలోని గ్రామ పంచాయతీ సర్పంచ్‌లకు సర్కులర్‌ను జారీ 
చేయనున్నట్లు ఆయన తెలిపారు.
ఇతర ప్రభుత్వ శాఖలను సమన్వయపరిచి ఏమైనా 
సమస్యలుంటే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, ప్రభుత్వం కల్పించిన ఈ 
అవకాశాన్ని మత్సకారులందరూ సద్వినియోగం చేసుకొని ప్రయోజనం పొందాలని జాయింట్ 
కలెక్టర్ కోరారు. అనంతరం ఫిషరీస్ అసిస్టెంట్ డైరెక్టర్ సతీష్ మాట్లాడుతూ 6 
నుంచి 8 మాసాల వరకు నీరు నిల్వ ఉండిన చెరువులో 35 నుంచి 45 మిల్లీ మీటరు 
సైజు గల కట్ల, రోహు, బంగారుతీగ చేపలను 50:25:25 నిష్పత్తి చొప్పున సరఫరా 
చేయడం జరుగుతుందని అదేవిధంగా సంవత్సరం పొడవునా  నీరు నిల్వ ఉండే చెరువులు, 
జలాశయాల్లో 80 నుంచి 100 మి.మీటరు సైజు గల కట్ల, రోహు చేప పిల్లలను చెరువు 
వద్దకే పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. మత్సకారుల సంఘం జిల్లా అధ్యక్షులు 
మల్లేశం మాట్లాడుతూ ప్రభుత్వం మంచి ఆశయంతో ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమాన్ని 
మత్సకారులు ఉపయోగించుకొని అభివృద్ధి చెందాలని విజ్ఞప్తి చేశారు. ఈ సదస్సులో
 ఎఫ్‌డిఒ భాస్కర్, జిల్లా మత్స పారిశ్రామిక సహకార సంఘాల ప్రతినిధులు, 
మత్సకారులు, మత్సశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
 
 
Post a Comment